27, జూన్ 2009, శనివారం

వ్యభిచారి

ఒక ధనవంతురాలు కారు దిగి హడావిడిగా ఒక బహుళ అంతస్తుల భవనంలోకి, ప్రవేశించి లిప్టు వైపు నడచుకుంటూ వెళుతున్నారు. వెనుకనుంచి, మేడం, మేడం అంటూ అరుపులు. ఆవిడ చిరాకుపడుతూ ఆగింది. ఓక సెక్యూరిటి గార్డు వచ్చి మేడం మీరు వ్యభిచరించారు అన్నాడు. అతని చెంప చెళ్ళు మంది. మేడం ఎందుకు కొట్టారు అన్నాడు. నేను వ్యభిచరించడమేమిటి అని ప్రశ్నించింది. మీరు ఎంట్రన్సులో పెర్మిషను తీసుకోకుండా లోపలికి వచ్చారు. అది నిజమే, నేను హడావిడిలో ఉన్నాను, కానీ దానికి మీరన్నదానికి సంబందమేమిటి అంది. అనుమతితో ఈ భనంలోకి ప్రవేశించాలి, అది ఇక్కడ నియమం. మీరు ఆ నియమాన్ని అతిక్రమించారు. నియమాలను అతిక్రమించడాన్ని సంస్కృతంలో వ్యభిచరించడం అంటారు.
పైన సంఘటనలో వ్యభిచరించడం అనే పదం పుట్టినప్పుడు వాడిన అర్థానికి, ఇప్పుడు మనం వాడుతున్న అర్థానికి చాలా చాలా భేదం ఉంది.
ఆ పదాన్ని అప్పటి అర్థంతో ఇప్పుడు వాడితే వచ్చే అనర్థమేమిటో అందరికీ తెలుసు.
పదాల అర్థాలకు డిక్షనరీల సాక్ష్యం చూపించవచ్చు. కానీ వ్యవహారంలో ఉన్న అర్థంలో వాడకపోతె గందరగోళమే.
పదాలు, సామెతలు అవిపుట్టినప్పటి నేపథ్యనికి సరిపోతాయి. కాని నేపథ్యం మారినపుడు, వాటి రిలవెన్సూ పోతుంది. ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా క్రొత్త పదాలు, సామెతలూ తయారవుతూనే ఉన్నాయి. క్రొత్తది వస్తే పాతది సహజంగానే మరుగున పడిపోతుంది. పాతది పోవాతలంటే పాతది పోవాలి అని మరలా కెలికి గుర్తు చేయకూడదు.
కాలేజీలో ఉన్నపుడు, టీచర్ సైలెన్స్ అని అరిస్తే అందరూ సైలెన్స్ అని అరిచేవారు. సైలెన్స్ కావాలంటే అందరూ సైలెన్స్ అని అరవకూడదు.

26, జూన్ 2009, శుక్రవారం

తెలియాల్సినవి - తెలుసుకోవాలనుకుంటున్నవి

ఒకసారి ఒక పెద్దాయన అంటుంటే విన్నాను. ( ఆయన ఒక ఉర్దూ పత్రికలో సబ్ ఎడిటర్ అట.)
" ఆజ్ కల్ లోగ్ అప్నా బచ్చొంకో ఇంజనీర్ యా డాక్టర్ బనానేకో సోచ్ రే, మగర్ కోయీ ఉన్ కో ఇన్సాన్ బనానేకో నై సోచ్ రే"
ఉర్దూ లో ఆద్మీ, ఇన్సాన్ అనే రెండు పదాలు ఉన్నాయి. రెండూ సమాన అర్దాలలోనే వాడతారు, కాని భేదం ఉన్నది. తెలుగులో వాటికి సమానమైన పదాలుంటే తెలుపగలరు. డెఫినిషన్లు చెప్పలేక పోయినా ఏ అర్దాలలో వాడతారో వ్రాస్తాను. తప్పులుంతే తెలుపగలరు.
ఆం ఆద్మీ - అనే ప్రయోగంలో చూచించబడేది, సామాన్య గుణాలుకలిగిన (ఆకలి, కోపము, బాధ, అప్పులు, పిల్లలు వగైరా వగైరా..) మనిషి.
వీటన్నిటితోపాటు, కరుణా, ప్రక్కవారు బాధ పడుతుంటే స్పందించడమూ, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడమూ వగైరా... ఉన్నవారిని ఇన్సాన్ అని అంటారు. ఇన్సానియత్ అనేది మానవత్వం అనే అర్థంలో వాడతారు.
అంటే పుట్టుకతో అందరూ మనుషులైనా మానవత్వము గల మనుషులవడం మనిషి మెదటి పని.
సమాజంలో మనిషి బ్రతకాలంటె (సమాజం బ్రతకాలంటే) ప్రతి మనిషికీ తెలివితేటలకంటే మానవత్వము ముఖ్యము.
చదువుతో ఇవి రావు. చదువు సహజ గుణాలను పెంచుతుంది అని మరొక మహానుభావుడు సెలవిచ్చారు.
అంటే ఇంజనీరింగు చదివిన చెడ్డ వాడు చెడ్డ ఇంజనీరు అవుతాడు. అలాగే ఇతర చదువులూ.
బుర్ర చాకు లాంటిదైతే చదువు దానికి పదును వంటిది. పదునెక్కిన చాకుతో నేర్పుగా బ్రతికించే ఆపరేషన్లు చేయవచ్చు, మర్డర్లూ చేయవచ్చు.
మనిషిపై సమాజం ప్రభావం ఉంటుంది. సమాజంలో మంచివారూ ఉన్నారు, చెడ్డవారూ ఉన్నారు. మనము సమాజంలో ఉన్నాము. మనచుట్టూ చెడ్డా ఉంది, మంచీ ఉంది. మంచిని మాత్రమే గ్రహించాలి. మంచిని మాత్రమే వెలిబుచ్చాలి. మనలో తయారయే చెడుని దిగమింగేయాలి. ఎందుకంటే మనము ఈ రోజు వెలువరించే చెడు ఎంతమంది చెడ్డవారవడానికి కారణమవుతుందో, తరువాత ఆ చెడ్డవారే మనకు ఇబ్బంది కలిగిస్తారేమో. మనము సమాజానికి ఇచ్చేది తిరిగి మనకు రావడమనేది ఇదే.
దీనినే ఒక సంస్కృత శ్లోకంలో చెప్పారు. దానర్థం:
మనిషి పనేంటంటే చెడ్డవాడు మంచివాడుగా మారాలి, మంచివాడు శాంతి పొందాలి. శాంతి పొందినవాడు,
బంధవిముక్తుడవాలి. బంధవిముక్తుడైన వాడు ఇతరులను బంధవిముక్తులను చేయాలి.
ఇప్పటివరకూ చెప్పుకున్నవన్నీ మనకు తెలియాల్సినవి.
మనిషి తెలుసుకోవాలంకుంటున్న విషయాలు అనంతము. ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్న వాటి లిస్టు పెరుగుతూనే ఉంటుంది. చిన్నప్పుడు చదువుకున్నవి ఇప్పుడు తప్పు అనిపించవచ్చు. పదేళ్ళ క్రితం చదివిన కోర్సు ఇప్పటి ఉద్యోగానికి పనికి రాక పోవచ్చు. ఇవన్నీ చదువులు. మనము చదవాలనుకున్న చదువులు. ఉద్యోగం కోసం చదివే చదువులు. తెలుసుకోవాలనుకున్న విషయాలు. మనలో మార్పొస్తే మన ఆశలు, ఆశయాలలో మార్పొస్తుంది. గతములో నేర్చుకున్నది టైమువేష్టు అనిపిస్తుంది.
తెలియాల్సినవి తెలుసుకున్న తరువాత తెలుసుకోవాలనుకుంటున్నవి ఎన్నయినా తెలుసుకోవచ్చు.
మొదటివి తెలియకపోతే తరువాతవి ఎన్ని తెలుసుకున్నా మనిషి (ఆద్మీ) మనిషిగానే ఉంటాడు. మనీషి (ఇన్సాన్) కాడు.

25, జూన్ 2009, గురువారం

బ్లాగులు ఎందుకు వ్రాస్తున్నాను - సమాజ స్పందన

21 వ శతాబ్దంలో, ప్రతివాడికి సెల్ ఫోను, కంప్యూటరు, ఇంటర్నెట్, బ్లాగూ సైటు ఆవశ్యకమై పోయాయి.
నేను ఈ మధ్యనే బ్లాగులోకంలోకి అడుగు పెట్టాను. నాకున్న కూసంత తెలుగు బాషాభిమానాన్ని గమనించిన ఒక మిత్రుడు, మీరెందుకు వ్రాయకూడదు అని తరచూ అడిగేవారు. చాలా కాలం నుంచి చాలా పుస్తకాలు చదివినా వ్రాయాలంటే ఏదో బెరుకు. అదే ఆమిత్రునితో అంటె, మొదట బ్లాగుల్లో ప్రయత్నంచు, వ్రాయడం బాగా సులువవుతుంది, అక్కడ అందరూ ఔత్సాహికులే అని భరోసా ఇచ్చారు.
ఇదేదో బాగుందే, అంత్రజాలంలో బ్లాగులోకం అంటూ, కొన్ని రోజులు కూడలినుంచి నాలుగు బజార్లు అటూ ఇటూ అంతా కలియ తిరిగాను.
జల్లెడ లొంచి చంద్రున్ని చూచ్తే చంద్రుడిలో బొక్కలు కనిపించాయి. అందరూ ఏమి వ్రాస్తున్నారు అని కనపడిన బ్లాగల్లా చదివాను.
చదవడం చాలా చకచకా సాగిపొయింది. ప్రతి బ్లాగూ ఒక క్రొత్త అనుభూతిని మిగిల్చింది, ప్రతిఒక్కరి నిరంతర పరిశ్రమ అందరికీ ఆనందదాయకమౌతుంటే ఈక్రొత్త సమాజం మానవ జాతి అభివృద్ది వేగిర పరుస్తుందని ఆనందపడ్డాను.
అప్పుడో చిన్న కలకలం.
ఒకరు వ్రాశారు. మరొకరు ప్రశ్నించారు. తిరిగి వ్యాఖ్య, దానికి ప్రతి వ్యాఖ్య, విమర్శ ప్రతివిమర్శ. వాదాలు వేడెక్కాయి.
క్రొత్త వాదాలు బయటపడ్డాయి. వర్గాలు ఏర్పడ్డాయి. వ్యంగ్య బాణాలు సందించారు, వ్యక్తిగత విమర్శల్లోకి దిగారు. చట్టాలు చూపారు, అంత్రజాల విలాసాలు వెతికారు. ముసుగు వీరుల నిజరూపాలివిగో అంటూ వార్తలు వెలువడ్డాయి.
ఇదేదో టీ కప్పులో తుఫాను అనుకుంటే, సునామీ దాకా వచ్చింది.
పెదరాయుళ్ళు పంచాయితీ నిర్వహిస్తున్నారు. సామరస్యంగా సాగుదామని మద్యమార్గుల చూచించారు.
కొందరు బ్లాగు వృద్దులూ, బ్లాగు శ్రేయోబిలాషులు, ఇరువర్గాలకు చూచనలిచ్చాయి. వ్యక్తిగత విమర్శలు, కుల మత ప్రస్తావనలు విడువ మన్నారు.
నాకు తోచినది చెప్పాలనిపించింది. అన్యాపదేశంగా జరుగుతున్నదానిని విమర్శింఛాను. నాకు తోచిన మంచిని చూచించాను. మంచంటే ఏంటని ప్రశ్నించారు. నాకు తెలిసినది చెప్పాను.
కొంచెం లోతుకు దిగి వెతకాలనుకున్నాను. ప్రశ్నించాను. జవాబిచ్చారు.
బ్లాగుల్లో రాతలకు సామాజిక ప్రయోజనం ఉందా లేదా అని ప్రశ్నలు తలెత్తాయి.
సామాజిక ప్రయోజనం ఆశించి వ్రాసెవాళ్ళు కొందరు, తమకోసం మాత్రమే వ్రాసేవాళ్ళు కొందరు లెక్క తేలారు.
సామాజిక ప్రయోజనం గురించి ఆలొచించక పోయినా ఇతరులకు కష్టం కలిగించే విషయాలు వ్రాయకపోతే చాలు అనుకున్నారు కొందరు.
బ్లాగుల్లో రాతలు సమాజం మీద ప్రభావం చూపిస్తాయా అనే కోణం తలెత్తింది.
మిగిలిన విషయాలేమోగాని, కులమతాలకు సంబందించినదైతే తప్పనిసరిగా ప్రభావితం చూపిస్తాయనిపించింది.
నాకు కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. అవి.
కొన్ని సంవత్సరాల క్రితం రచయిత్రి తస్లీమా నస్రీన్ పై హైద్రాబాదు నడిబొడ్డులో దాడి జరిగింది. (ఇస్లాం ను విమర్శిస్తున్నారని. దాడి చేసిందీ ఆ వర్గీయులే).
ఏప్పటినుండో రచయిత సల్మాన్ రష్దీ పై ఫత్వా జారీ చేయబడినది (ఇస్లాం ను విమర్శిస్తున్నారని, ఆయనను చంపమని)
యూరప్ లో పత్రికల్లో అల్లాను కించపరుస్తూ వేసిన కార్టూన్ లు ప్రపంచ వ్యాప్తంగా అల్లరులు రేపాయి.
డావిన్సీ కోడ్ సినిమా భారత్ లో విడుదలచేయరాదంటూ కొందరు కోర్టుకెక్కారు.
పై సంఘటనలలో రచయితలు, కళాకారులు తమ తమ అభిప్రాయలు వెలిబుచ్చారు (అనే అనుకుందాము). మరి జనులెందుకు స్పందించారు?
నాకు అనిపించింది, బహిరంగంగా జరిగేవన్నీ సమాజంలో స్పందన కలగజేస్తాయని. దేనికి ఎంతగా స్పందిస్తారో కూడా అంచనావేయలేమని.
కనుక మనము వ్రాసుకునేది, వెలిబుచ్చేది మనకోసమేనైనా అది సమాజంలో ఎదో ఒక స్పందన కలిగిస్తుందని బ్లాగరులందరూ గమనించ ప్రార్థన.

23, జూన్ 2009, మంగళవారం

చెరువు - చెత్త

ఒక చెరువు. చాలా పెద్ద చెరువు. ఎంతో పురాతనమైనది. ఎప్పటినుండి ఉన్నదో ఎవరికీ తెలియదు. ఎన్నో తరాలుగా జనులు, పశు పక్ష్యాదులు, జలచరాలు, చెట్లు, అన్నిరకాల ప్రాణులు ఆనీటితో బ్రకుతున్నాయి. కాలక్రమేణా దానిలో బాగా చెత్త పేరుకు పోయింది. అందరూ, ఆచెత్త వల్ల వచ్చే వాసన, ఆనీటివల్ల వచ్చే రోగాలకు గురౌతున్నారు. జనులందరూ ఎన్నుకున్న ప్రభుత్వ వ్యవస్థ, కొన్ని చోట్ల నీతి శుద్ధి ఏర్పాట్లు చేసి కొంతమందికి ఆ నీటిని అందిస్తుంది.
చెత్త ఉందనే విషయం అందరికీ తెలిసినదే. దానికి కారణాలు కనిపెడదామని సంకల్పించారు కొందరు బుద్దిజీవులు. ఎక్కడెక్కడో వెతికారు, ఎంతో విషయ సేకరణ చేశారు, విశ్లేషించారు, క్రోడీకరించారు. తమ పరిశ్రమ ఫలాలను ప్రజలలోకి తెచ్చారు.
ఈ చెరువులోని చెత్త చాలాకాలమునుండి ఉన్నది. సుమారుగా కొన్ని వేల ఏళ్ళ నుండి ఉన్నది. దీనికి కారణాం ఒక పెద్ద మనిషి. ఆ చెరువును ఆ పెద్ద మనిషి తొవ్వించి ఉండవచ్చు, లేదా అప్పటికే ఉన్న చెరువుకు నాలుగు గట్లు తనకాలంలో ఏర్పాటు చేసి ఉండవచ్చు నని నేను బలంగా విశ్వసిస్తున్నాను అని ప్రజలముందుంచారు.
ప్రజలు ప్రశ్నించారు.
తమకంటే ముందు ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారు వ్రాసి ఉంచిన సమాచారాన్ని తమ సిద్దాంతాలకు ఆధారాలని పరిశోధకులు వాక్రుచ్చారు.
ప్రజలలో వాదోపవాదాలు చెలరేగాయి. కొనసాగుతున్నాయి.
కళ్ళకు కనిపిస్తున్న చెత్తకు కారణం వెతకడం అవసరమా? చెత్త సమస్య(ల)కు కారణాలు కనిపెట్టడం సమస్య పరిష్కారమా?
నాకు తోచినది చెత్తను తొలగించడమే పరిష్కారమని, మరలా ఎవరూ చెత్త వేయకుండా అందరూ కృషి చేయాలని.
బుదజనులు వ్యాఖ్యానించ ప్రార్థన.

మంచి - చెడు

ప్రక్కవాడికి మంచి, మనకు మంచి అనిపించక పోవచ్చు, మనకు మంచనిపించినది ప్రక్కవాడికి చెడ్డనిపించొచ్చు.
చేశేది, చేయాలనుకునేది మంచో చెడో చేసేవాడే ఆలోచించాలి. మరి మంచి, చెడులను నిర్ణయించడమేలా?
ఎక్కువ మందికి, ఎక్కువ కాలం ఎక్కువ సుఖాన్నిచ్చేది మంచి.
మనకు ఇతరులు ఎదిచేయకూదని మనము కోరుకుంటామో (అది చెడు). అది మనము ఇతరులకు చేయకూడదు.
ఇలాంటివి అన్ని మత గ్రంథాలలోను చెప్పారు.

22, జూన్ 2009, సోమవారం

మనుస్మృతి రాసేనాటికి ఆ కులవ్యవస్థ - సత్యాన్వేషణ

చారిత్రక సత్యాలనుకొంటున్నవాటిని వెలికితీసి, దుమ్ము దులిపి, వాటితో అంతర్జాలంలో, మాటల మాయాజాలాలు, బ్లాగుల్లో భావస్కలనాలు.

సత్యాన్వేషణ పరమార్థం సమాజ ప్రయోజనం. ఉపయోగం లేని సత్యాల సేకరణ శిరోవేదనం, కాలాహరణం, కలహ కారణం.
సమస్యను చూచే తీరును బట్టే, సత్యాన్వేషణ ఉంటుంది. అన్వేషణ, శాస్త్రీయ శోధనలను అన్నింటికీ ప్రయోగిస్తూ పోతే, కొన్ని సార్లు అర్థం పర్థం లేని అసత్య సత్యాలతో అన్వేషణ ఆగిపోతుంది. అసత్య సత్యాలను (అబద్ద నిజాలు), అసమగ్ర సత్యాలను, ప్రకటిస్తే విమర్శలు వెల్లువెత్తుతాయి. తను నమ్మిన సత్యాలను, నిజ సత్యాలని వాదిస్తే, ఇతరులు కూడా వారు నమ్మిన సత్యాలే నిజాలని వాదిస్తారు.

మనుస్మృతి రాసేనాటికి ఆ కులవ్యవస్థ వ్యవస్థీకృతమయిన ఆధారాలున్నాయి, అనే వాక్యము చూస్తే, మనుస్మృతి అనేది, మనువు అనే వ్యక్తి వ్రాసినదా, లేదా మనువు అనే వ్యక్తి చెబితే వేరేవాళ్ళు వ్రాసినదా, లేక మనువు అప్పటికే వ్యవహారంలో ఉన్న వాటిని సంకలనం చేశాడా?
మెదటి వాక్యము సత్యమయితే, ఈ ప్రశ్నలకు సమాదానం దొరకనంత వరకు అది అసమగ్ర సత్యము.
మెదటి వాక్యము అసత్యమయితే, దానిపై ఆధారపడిన, తదుపరి సత్యాలన్ని, అసత్య సత్యాలవుతాయి.
మనుస్మృతిలో కులవ్యవస్థ లోని బాగోగుల చర్చేమయినా ఉందా? లేదా మనుస్మృతి వ్రాయబడిన కాలంలో వ్రాయబడిన వేరేవయినా రచనలో ప్రజలు కులవవస్థ వలన బాధలు పడ్డట్లు ఏమయినా వ్రాతలున్నాయా? ఆసలు మనువెప్పటి వాడు. ఈ పశ్నలకు సమాదానాలు తెలిపినచో తదుపరి సత్యాన్వేషణ కొనసాగిద్దాం

బ్లాగుల్లో గజ్జి బాధలు - నివారణోపాయాలు.

తెల్ల వాళ్ళ దేశంలో, తెల్లవాళ్ళకు నల్లవాళ్ళ మీద చిన్న చూపు, నల్లవాళ్ళకు తెల్లవాళ్ళమీద కోపం. (రంగు గజ్జి).
జర్మనీలో ఒక నియంత ఆర్యులు గొప్పవారు, అనార్యులు తక్కువ అని కెలికి ప్రపంచ యుద్దనికి కారణమయ్యారు. (తెగల గజ్జి).

భారత దేశంలో కూడా ఇలాంటివే రెండు రకాల గజ్జితో ప్రజలు బాధ పడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

ప్రజలు పల్లెల నుండి పట్టణాలకు వస్తున్నారు, విద్యాధికత పెరిగింది, ప్రేమవివాహాలు పెరిగాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి.
వీటన్నిటి కారణంగా గజ్జి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టిందని ఇతర బ్లాగర్లూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఎవరికి వారు, వాళ్ళ గజ్జిని ఎవరూ చూడకుండా గోక్కుంటూ, అప్పుడప్పుడూ సారూప్య గజ్జి సోదరులతో కలిసి సామూహిక గోకుడు కార్యక్రమాలతో తమ తమ కుతి తీర్చుకుంటున్నారు, గజ్జి నివారణకూ, దాని కారణంగా ఉత్పన్న మవుతున్న ఇతర బాధలు పెరగ కుండా జాలింలోషన్ కొనుక్కుని వాడుకుంటున్నారు. ఇంతవరకూ ఎవరికి ఇబ్బందిలేదు. ఎందుకంటే గజ్జి అదుపులో ఉంది కాబట్టి.

ఈమధ్య విజ్ఞానాన్ని మధించి, ఔపోసన పట్టిన లోకహితాభిలాషులు గజ్జి పై పరిశొధనలు జరిపి, ఇది ఇప్పటి గజ్జి కాదు, ఈ గజ్జికి ఇంకొక గజ్జి కారణం, అది తల్లి, ఇది పిల్ల దీని పుట్టు పూర్వోత్తరాలు ఇవి, ఈ గజ్జి ఫలనా వారు సృష్టించారు, ఫలనా వారు విస్తరింపజేశారు, ఇవన్నీ చారిత్రక సత్యాలు, ఇవి మేము క్రొత్తగా చెప్పినవి కావు, మా గజ్జి మేము తెచ్చుకున్నది కాదు, ఇతర గజ్జి వారు, మమ్ములను విమర్శిస్తున్నారూ, అంటూ బహిరంగంగా తాము కనుగొన్న పాత సత్యాలను క్రొత్తగా వెలుగు పరచారు.

దీంతో మిగతా వారందరూ, బాహాటంగా ఒకరికొకరు గుడ్డలూడదీసి ఎవరికి ఎక్కువ గజ్జుందో చూడండంటూ కొలతలు మొదలు పెట్టారు.

ప్రభుత్వం వారుకూడా, గజ్జివారిని వారి వారి గజ్జి లక్షణాలు, వాటి పుట్టుపూర్వోత్తరాల పరంగా వర్గీకరిస్తూ, గజ్జి వ్యాప్తికి యథోశక్తి పాటు పడుతున్నారు. జాలింలోషన్ కొనుక్కోలేని కొంతమంది గజ్జి బాధితులకు ఉచితంగా సరపరా చేస్తున్నారు. కొంతమంది జాలింలోషన్ వినియోగము, పంపిణీలలోని అవకతవకల, సాధక బాధాకాల కారణంగా, మరింత శాస్త్రీయ గజ్జి పరిశోదన అవసరమనీ, మరింత వర్గీకరణా అవసరమనీ ప్రభుత్వంవారిని కోరుతున్నారు. దానిని ఇతర గజ్జి సోదరులు వ్యతిరేకిస్తున్నారు.

పై నేపథ్యంలో గజ్జి వ్యాప్తి నిరోధమూ, నివారణోపాయాలు:

1. ప్రభుత్వాలు మరింత శాస్త్రీయంగా శోధించి, గజ్జి, పుట్టుక లోని తేడాల ఆదారంగా మరింతగా వర్గీకరించి ప్రతి వర్గీకృత గజ్జికి ప్రత్యేక కోటా జాలింలొషన్ సరపరాలు చేసి గజ్జి బాధోపశమనం కలిగించాలా,
లేక
గజ్జికి ప్రభుత్యం గుర్తింపు లేదు, గజ్జి సమాజ దురాచారం. దానిని ఎవరూ తలచరాదు, వ్యాప్తిచేయరాదు అని రాజ్యాంగ మార్పు చేయాలా? ఇది ప్రభుత్వంవారు ఆలోచించాలి.

2. సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎవరూ ప్రక్క వారిని గజ్జి (గురించి) ప్రశ్నలు వేయకుండా, గజ్జి వ్యాప్తి నిరోధానికి పాటుపడాలి. కొండొకచో కొందరు పరమ(అ)జ్ఞానులు, గుల ఆపుకోలేక ఇలాంటివి బహిరంగ చర్చకు తెస్తే, అందరూ ముక్త కంఠంతో గజ్జి మనకు అవసరం లేదు అని చెప్పండి. గజ్జి కొట్లాటలకు పోకండి.

కొన్ని తరాలలో గజ్జి, దాని దుష్ప్రభావాలు పూర్తిగా పోతాయని (మన అదృష్టం బాగుంటే ఈ తరంలోనే అది జరుగుతుందని) ఆశిద్దాం. దాని సాధనకు అందరం కృషి చేద్దాం.